వైసీపీ అధినేత జగన్ పర్యటనలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. “ముగ్గురు మూర్ఖులు కలిశారు కదా అని జగన్ను ఆపగలరా?” అని విరుచుకుపడ్డ ఆయన, అరచేతి నీడతో సూర్యకాంతిని ఆపలేనట్టే, జగన్ను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ప్రజల్లో జగన్కు ఉన్న ఆదరణను చూసి ప్రభుత్వం గబ్బర పడుతోందని ఆరోపించారు.
జగన్ చిత్తూరు పర్యటన ఖరారవ్వగానే ప్రభుత్వం తడబాటు మొదలెట్టిందని నాని ఎద్దేవా చేశారు. మార్కెట్ యార్డును మూసివేసి, వ్యాపారులను, రైతులను ఆపటం ప్రభుత్వ భయాన్ని స్పష్టంగా చూపిస్తున్నదని వ్యాఖ్యానించారు. రైతులు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలను వినే నాయకుడే లేకుండా పోయిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం తమ 164 సీట్ల విజయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నా, వారి పాలనలో రైతులకు సరైన గిట్టుబాటు ధర కూడా దొరకడం లేదని నాని విమర్శించారు. హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజల సొమ్ము ఖర్చు చేస్తూ, పంట ధరలు పట్టించుకోని నేతలు రాష్ట్రానికి శాపంగా మారారని అన్నారు. మామిడి, పెసలు, మినుముల ధరలు పడిపోతున్నా, ప్రభుత్వం చేతులు చాటు పెట్టుకొని కూర్చుంటోందని ఆరోపించారు.
మామిడి రైతులను పరామర్శించేందుకు జగన్ వస్తానని చెప్పిన వెంటనే ప్రభుత్వం స్పందించిందంటే, వారి అసలు చిత్తశుద్ధే ఏమిటో తెలుస్తోంది అని నాని వ్యాఖ్యానించారు. మామిడిపై 3.5 లక్షల టన్నుల కొనుగోలు జరిగిందని చెప్పే ప్రభుత్వం ఒక్క రైతుకైనా లబ్ధి ఎలా చేకూరిందో చూపించాలని ఆయన సవాలు విసిరారు. నిజంగా రైతుల పక్షాన ఉన్నారని అనుకుంటే, మామిడికి గిట్టుబాటు ధర రావడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.









