పట్టుదలతో కృషి చేస్తే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపిస్తూ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని కేసుపల్లి గ్రామానికి చెందిన సాగబోయిన పాపారావు అసాధారణమైన ప్రయాణాన్ని పూర్తి చేశారు. 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో తొలి ఆదివాసి పరిశోధక విద్యార్థిగా ఆయన నిలిచారు. 2018 విద్యా సంవత్సరం లో ప్రొఫెసర్ పి. విష్ణు దేవ్ పర్యవేక్షణలో “ఉప ప్రణాళిక మరియు గిరిజన అభివృద్ధి – ఐటిడిఎ భద్రాచలం యొక్క సామాజిక శాస్త్ర అధ్యయనం” అనే అంశంపై లోతైన పరిశోధన చేసి పీహెచ్డీ థీసిస్ సమర్పించారు.
ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, విభాగాధిపతులు, పరిశోధన పర్యవేక్షకుల సమక్షంలో పాపారావును అధికారికంగా డాక్టరేట్ అందుకున్న తొలి ఆదివాసి పరిశోధకుడిగా ప్రకటించారు. ఈ సందర్భంగా పాపారావు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఓయూ సోషియాలజీ విభాగ అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. పేద ఆదివాసి కుటుంబంలో పుట్టి ప్రాథమిక విద్యను కేసుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయన, హైస్కూల్ దశలో ఆర్థిక సమస్యలతో చదువును ఆపాల్సి వచ్చింది.
సంకల్పబలం తో ముందుకు సాగిన ఆయన మేకల కాపరిగా పనిచేస్తూనే చదువును కొనసాగించాలనే తపనతో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పూర్తిచేశారు. పై చదువుల కోసం పట్టణానికి వెళ్లి పాలు పంపిణీ, పేపర్ బాయ్, టెలిఫోన్ బూత్ ఉద్యోగాలు చేస్తూ సెకండరీ ఎడ్యుకేషన్, డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, చివరకు అత్యున్నతమైన డాక్టరేట్ పట్టా సాధించడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమవుతుందని, సంకల్పం ఉన్నవారికి అడ్డంకులు అడ్డం కాదని పాపారావు తెలిపారు. ఆయన సాధనపై తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ ఆర్కియాలజీ & మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం, ఓయూ సిడిసి డీన్ ప్రొఫెసర్ రాజేందర్, వివిధ విద్యార్థి సంఘాల నేతలు అభినందనలు తెలిపారు. పాపారావు విజయం ఆదివాసి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.









