ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించేందుకు సమగ్ర వ్యూహంగా రూపొందించిన ‘పీ4 – పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం’ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని అధికారులతో సమీక్షించి, ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. త్వరలోనే ఈ పథకం సంబంధిత సమాచారంతో www.zeropovertyp4.ap.gov.in అనే వెబ్‌సైట్ అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. ఇది ప్రపంచ దేశాలకూ ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారైలు మరియు తెనాలి వాసుల భాగస్వామ్యాన్ని కలిపి, వారి సహకారంతో స్థానిక మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెనాలి వాసులు తమ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములవుతారని, వారి సహాయంతో ఉపాధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మద్దతు అందించబడుతుందని మంత్రి తెలిపారు. ఇది సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
2047 విజన్‌లో భాగంగా, 2029 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేయాలనే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది. ముఖ్యంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి, వారికి అవసరమైన మద్దతు అందించడం ద్వారా “బంగారు కుటుంబాలు” గా మార్చడం పీ4 యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ దిశగా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణను అమలు చేయనుంది.
తెనాలి నియోజకవర్గాన్ని పైలట్‌గా తీసుకొని ఇప్పటికే 14,280 బంగారు కుటుంబాలను గుర్తించి, 376 మంది మార్గదర్శకులు, దాదాపు 3,289 కుటుంబాలను దత్తత తీసుకున్నారని మంత్రి నాదెండ్ల తెలిపారు. వీరి సహకారంతో ఉపాధి, విద్య, వైద్యసేవలు, బ్యాంకు రుణాలు, వ్యవసాయ మార్కెటింగ్ వంటి అంశాల్లో తగిన మద్దతు అందించనున్నారు. త్వరలో తెనాలిలో మార్గదర్శకులతో ఒక పరిచయ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ యాక్షన్ ప్లాన్ తెనాలికి ఒక అభివృద్ధి రోడ్‌మ్యాప్‌గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.









