జాతీయ భద్రత ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్ర డీజీపీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాసిన ఆయన, ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు మారాయనీ, సంబంధిత శాఖల మధ్య సమన్వయం అత్యవసరం అని తెలిపారు. విజయనగరంలో ఓ యువకుడి ఐఎస్ సంబంధాలు వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు.
ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారుల కదలికలపై అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కోరారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సముద్ర తీర రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. పహల్గామ్ ఘటనలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని అనుమానితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, కేంద్రానికి నివేదిక పంపాలని తెలిపారు.
గుంటూరు, ఇతర జిల్లాల్లో రోహింగ్యాల ఉనికిపై పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రస్తావించారు. వారి వద్ద ఆధార్, రేషన్, ఓటర్ కార్డులున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఈ విధంగా అనుమానితులు పత్రాలు ఎలా పొందారో, వారికి సహకరిస్తున్న వ్యక్తులు ఎవరన్న అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన, తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
రాష్ట్ర పోలీసు యంత్రాంగం శాంతి భద్రతలతో పాటు దేశ భద్రత విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో గుంటూరు, రాయలసీమ ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడుల అనుభవాలను గుర్తు చేస్తూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తీవ్రవాద నిరోధ చర్యలు మరింత బలపరచాలని కోరారు. తీర ప్రాంత నిఘా వ్యవస్థపై కేంద్రం కూడా స్పందించిందని, కేంద్ర-రాష్ట్ర యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.









