భగవంతుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పగబట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో సమావేశమైన అనంతరం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ తిరుమలని ఏడు కొండలుగా పిలుస్తారని, కానీ వైసీపీ నాయకులు మాత్రం రెండు కొండలంటూ మాట్లాడటం వారి దృక్పథాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు నాయుడు తమకు చదివి వినిపించారని పవన్ వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం లడ్డూ నెయ్యిలో బీఫ్ కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉన్నట్లు తేలిందన్నారు. అన్ని అంశాలపై పూర్తిగా చర్చించిన తర్వాతే తాము ప్రజల ముందుకు వచ్చామని, పర్యవసానాలు ఆలోచించకుండా మాట్లాడే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
ప్రజలు తమకు ఐదేళ్ల పాటు పాలన చేసే బాధ్యత అప్పగించారని, రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం తమకు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యితో అయోధ్యకు లక్ష లడ్డూలు పంపారని, ఇది 59 లక్షల కేజీల నెయ్యి కాదని, కల్తీ పామాయిల్‌గా పిలవాలని వ్యాఖ్యానించారు. భోలేబాబా డెయిరీ 58 లక్షల కేజీల పామాయిల్‌తో పాటు లక్ష కిలోల రసాయనాలను కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో హిందూ ధర్మంపై అనేక దాడులు జరిగాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆలయాల పవిత్రతను దెబ్బతీసే చర్యలు తీవ్రమైన నేరమని అన్నారు. తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంపై జరిగిన ఈ ఘటనను దేశం మొత్తం గమనిస్తోందని, దీనిపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు.









