వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, టీడీపీని లక్ష్యంగా చేసుకొని కొడాలి నాని, వల్లభనేని వంశీలను అరెస్ట్ చేయించాలన్నదే అసలైన ఉద్దేశమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, పేర్ని నాని తన కుమారుడికి కృష్ణా జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కల్పించేందుకు దారితీసే పన్నాగమే ఇదని విమర్శించారు. వైసీపీ నేతలు వ్యవస్థలను, శాసనసభను భ్రష్టుపట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
పేర్ని నాని వాడిన భాష పూర్తిగా అశోభనీయమని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. “ఒకవైపు చంద్రబాబు 76 ఏళ్లు అని తక్కువ చేస్తారు, మరోవైపు ఆయన భద్రత లేకుండా 7 కిలోమీటర్లు నడిచేలా చేశారు. ఆయన చేసిన అభివృద్ధిని దేశ ప్రధానే ఆదర్శంగా తీసుకున్నారు. అలాంటి వ్యక్తిని అవమానించడమంటే తెలుగువారి గౌరవాన్ని తక్కువ చేసినట్లే,” అని ఘాటుగా స్పందించారు.
పేర్ని నానిని, రాంగోపాల్ వర్మను ఉద్దేశిస్తూ – “వైసీపీ నేతల బూతుల రాజకీయాలు చూస్తుంటే ‘రప్పా రప్పా’ అనే టైటిల్‌తో సినిమా తీయొచ్చు” అని ఎద్దేవా చేశారు. వంశీ, కొడాలిలా రాష్ట్రాన్ని హింసాత్మక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాలనే యత్నం జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ నాయకులు రాజకీయ శత్రుత్వంతో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన చెప్పారు.
చివరిగా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎలాంటి రాజకీయ కక్షలకూ తావులేదని స్పష్టం చేశారు. “తప్పు చేసిన వారెవరిదైనా – వారు వైసీపీ నేతలే అయినా – చట్టం తన పని తాను చేస్తుంది. నిందితులను శిక్షించడమే లక్ష్యం. పేర్ని నాని వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకోవాలి, లేకపోతే అదే రోడ్డులో వైసీపీ మిగతా నేతలూ దిగిపోతారు” అంటూ సోమిరెడ్డి హెచ్చరించారు.









