భారత్–అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌పై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ఒప్పందం భారత్, అమెరికా రెండింటికీ లాభదాయకమని, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని బీజేపీ పేర్కొంటోంది. అయితే దేశ ప్రయోజనాలను అమెరికాకు మోడీ అమ్మేశారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ డీల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, అమెరికా–భారత్ సంయుక్త ప్రకటనలో స్పష్టమైన వివరాలు లేకపోయినా, బయటకు వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. భారత్ ఇకపై రష్యా నుంచి చమురు దిగుమతి చేయకూడదన్న ఆంక్షలు విధించే అవకాశముందని, రష్యా నుంచి నేరుగా లేదా పరోక్షంగా చమురు కొనుగోలు చేస్తే 25 శాతం పెనాల్టీ టారిఫ్‌లు విధిస్తామని అమెరికా హెచ్చరించిందని ఆరోపించారు.
అదేవిధంగా అమెరికా రైతులకు మేలు చేసేలా భారత్ దిగుమతి సుంకాలను తగ్గించనున్నట్లు సమాచారం ఉందని, ఇది భారతీయ రైతుల ప్రయోజనాలకు తీవ్రంగా నష్టం కలిగించవచ్చని జైరాం రమేశ్ పేర్కొన్నారు. అమెరికా నుంచి భారత్‌కు జరిగే వార్షిక దిగుమతులు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల ఇప్పటివరకు ఉన్న ట్రేడ్ సర్ప్లస్ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఐటీ సహా సేవల ఎగుమతుల విషయంలో కూడా భారత్‌కు అనిశ్చితి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో “నమస్తే ట్రంప్” కంటే “హౌడీ మోదీ”కే పైచేయి ఉన్నట్లు పరిస్థితి కనిపిస్తోందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. అన్ని ఆలింగనాలు, ఫోటో సెషన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని విమర్శలు గుప్పించింది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ డీల్ దేశ ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలమేనని, దీర్ఘకాలంలో భారత్‌కు మేలు చేస్తుందని స్పష్టం చేస్తోంది. దీంతో ఈ ట్రేడ్ డీల్‌పై రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.









