రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రైవేట్ స్కూల్స్ బంద్ ఉంటాయని యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. కొంతమంది అధికారులు తనిఖీలు, నోటీసుల పేరుతో స్కూల్ యాజమాన్యాలను వేధిస్తుండటం వల్ల బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ స్పష్టం చేసింది. విద్యా రంగంలో నిరంతరం సేవలందిస్తున్న తమను ఇలా లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ స్కూల్స్ వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా పెద్దఎత్తున విద్యా సేవలు అందుతున్నాయని అసోసియేషన్ వివరించింది. రాష్ట్రంలోని విద్యార్థుల్లో 55 శాతం మంది ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదువుతుండటంతో, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు తమ పాత్ర కీలకమని పేర్కొన్నారు. అయినా కొన్ని మంది అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
స్కూల్ యాజమాన్యాల నిరసనలో భాగంగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ రేపు మూతవేయబోతున్నాయని, ఈ బంద్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. తనిఖీలు, చర్యలు తగిన ఆధారాలతో, న్యాయంగా జరగాలని, సాంకేతిక లోపాలను సానుకూలంగా పరిష్కరించే విధంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తనిఖీల పేరుతో వేధింపులు ఆపకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని అసోసియేషన్ హెచ్చరించింది. ప్రభుత్వానికి సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తున్నా, ఇంకా పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈ బంద్‌కు వెళ్తున్నామని స్పష్టం చేసింది. త్వరగా చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని కోరింది.









