విశాఖపట్నం జిల్లా సింహాచలంలో జరిగిన విషాదకర సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో చందనోత్సవం సందర్భంగా జరిగిన గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావుతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ ఈ కమిషన్‌లో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలు, ఏర్పడిన లోపాలు, బాధ్యుల గుర్తింపు వంటి అంశాలపై ఈ కమిటీ లోతుగా పరిశీలించనుంది. ఈ కమిషన్‌కు సివిల్ కోర్టు స్థాయి అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన భక్తులకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించారు.
దుర్ఘటనలో కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబాల్లో ఒకరికి దేవాదాయ శాఖ పరిధిలో ఉద్యోగం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వ దృష్టి సారించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.









