కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరి నదిలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నానం కోసం నదిలోకి దిగిన 11 మంది యువకుల్లో 8 మంది నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్వేగం కలిగించింది. స్నానానికి వచ్చిన వారు శురుల్లంక గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన వారు కాగా, సరదాగా గోదావరి నదిలోకి దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
గల్లంతైన యువకుల్లో ముగ్గురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఎనిమిది మంది జాడ తెలియకుండా పోయింది. గల్లంతైన యువకులను క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేశ్, రాజేశ్, రోహిత్, మహేశ్‌గా గుర్తించారు. ఈ యువకులు కాకినాడ, మండపేట, రామచంద్రపురం ప్రాంతాలకు చెందినవారని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి గల్లంతైన యువకులను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాలింపు చర్యల పురోగతిని కూడా కలెక్టర్ ద్వారా తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
గల్లంతైన యువకుల కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి బాధ చూసి అందరు కన్నీరు పట్టలేకపోతున్నారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ, అధికారులు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తూ యువకుల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.









