ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ఒక ప్రయాణికులతో వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ఘోర విషాదం జరిగింది. ఈ ఘటన కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన కొందరు వ్యక్తులు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు తాటిచెర్లమోటు వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. చుట్టుపక్కల ఉన్నవారు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు.
మృతుల్లో గజ్జల అంకాలు (50), గజ్జల జనార్ధన్, గజ్జల భవాని (20), గజ్జల నరసింహ (20), సన్నీ ఉన్నారు. మరొక మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడినవారిని జీతన్, శిరీషగా గుర్తించారు. వీరిలో శిరీష పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తరలించారు. బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన యావత్ ప్రాంతాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.









