టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు

TTD Board meets in Tirumala to take key decisions on pilgrim facilities, temple development, greenery, and healthcare infrastructure.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి ఈ ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలపై సమగ్రమైన చర్చ జరిగింది. ముఖ్యంగా శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసిన ‘డీడీ నెక్ట్స్ లెవల్’ సినిమా బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానించటం గమనార్హం. ఈ వివరాలను బీఆర్ నాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

పచ్చదనం పెంపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమల కొండలలో పచ్చదనాన్ని 80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న టీటీడీ, అటవీశాఖ సహకారంతో దీన్ని దశలవారీగా అమలు చేయనుంది. ఈ ప్రక్రియలో 2025–28 మధ్య ఆర్థిక సంవత్సరాల్లో రూ.3.99 కోట్ల నిధులను విడుదల చేయనుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు తిరుమల సుందరతను మరింతగా మెరుగుపరచేందుకు ఈ చర్యలు తీసుకోనున్నారు.

అలాగే, పలు ప్రముఖ ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయనుంది. తిరుచానూరు, అమరావతి, నారాయణవనం, కపిలతీర్థం, నాగాలాపురం, ఒంటిమిట్ట ఆలయాల సమగ్ర అభివృద్ధి కోసం ఆర్కిటెక్ట్‌ల నుంచి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు కోరనున్నారు. విశ్రాంతి భవనాల పేర్ల మార్పుపై కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్సుల కేటాయింపులో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రముఖ సంస్థలకు అప్పగించనున్నారు.

వైద్య రంగంలో స్విమ్స్ ఆసుపత్రికి అదనంగా రూ.71 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించడమే కాక, స్విమ్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆంకాలజీ, చిన్న పిల్లల ఆసుపత్రి పనులను త్వరితగతిన పూర్తిచేసి సేవలందుబాటులోకి తేవాలని తీర్మానించింది. అదనంగా, తిరుమలలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ అమలు, అన్నదాన సేవల విస్తరణ, తుళ్లూరులో ఆలయ అభివృద్ధి వంటి అంశాలపై కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకోవడం విశేషం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share