భక్తుల మనోభావాలతో వైసీపీ చెలగాటం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిని కల్తీ చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడమే కాకుండా, పవిత్రమైన దేవదేవుడి ప్రసాదాన్ని కూడా వదల్లేదని ధ్వజమెత్తారు.
దర్యాప్తు సంస్థలు స్పష్టమైన ఆధారాలతో కల్తీ జరిగినట్లు నివేదికలు సమర్పించినప్పటికీ వైసీపీ నేతలు సిగ్గులేకుండా బుకాయిస్తున్నారని మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసంతో పాటు భక్తుల ఆస్తిక భావాలను కూడా వైసీపీ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని ఆరోపించారు. తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడం అత్యంత బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నివేదికలోని కీలక అంశాలను ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 60 లక్షల కిలోల నెయ్యిని భోలే బాబా, వైష్ణవి వంటి సంస్థలు సరఫరా చేశాయని, అయితే దర్యాప్తులో అందులో అసలు నెయ్యే లేదని తేలిందన్నారు. ఈ విషయం మొత్తం వ్యవస్థలో జరిగిన భారీ కుట్రకు నిదర్శనమని పేర్కొన్నారు.
సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) నివేదిక ప్రకారం.. పామాయిల్, లాక్టిక్ యాసిడ్, మోనో లాక్టిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిపి కృత్రిమ నెయ్యిని తయారు చేసి తిరుమలకు సరఫరా చేసినట్లు స్పష్టమైందని మంత్రి తెలిపారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం టెండర్ నిబంధనలను మార్చి, అనర్హులైన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ దారుణాలపై బాధ్యులందరిపై కఠిన చర్యలు తప్పవని కొల్లు రవీంద్ర హెచ్చరించారు 🔥🙏

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share