తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర, జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అన్యాయాలను, అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి సోషల్ మీడియాను శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి యువతే ప్రధాన బలమని, వారి భాగస్వామ్యం అత్యంత అవసరమని జగన్ అన్నారు.
జగన్ మాట్లాడుతూ యువజన విభాగం పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని, కష్టపడి పనిచేసినవారికి అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. “రాజకీయంగా ఎదగడానికి ఇది గొప్ప అవకాశం. సమర్థత ఉన్న యువతను గుర్తించి పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురావాలి. యువతలో రాజకీయ అవగాహన పెంచి, వారిని నాయకులుగా తీర్చిదిద్దడం మా లక్ష్యం” అని జగన్ తెలిపారు. పార్టీని మరింత శక్తివంతం చేయడానికి జోన్ల వారీగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నట్లు ఆయన వివరించారు.
తన రాజకీయ ప్రస్థానం గురించి వివరిస్తూ, జగన్ యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. “వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టినప్పుడు నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నాపై ఉన్న విశ్వాసంతో ఎందరో నాతో కలిసి నడిచారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. 2014లో 67 మంది ఎమ్మెల్యేలతో గెలిచినా, వారిలో 23 మందిని తుర్లా తీసుకెళ్లారు. అయినా విలువలు, విశ్వసనీయతను ఎప్పుడూ వదల్లేదు” అని జగన్ గుర్తుచేశారు. ఉప ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచిన విషయాన్ని, తిరిగి 18 మంది ఎమ్మెల్యేలతో గెలుపు సాధించిన ఘట్టాన్ని ఆయన ప్రస్తావించారు.
జగన్ యువతకు సూచిస్తూ ప్రజలతో బంధం కలిగి ఉండటం రాజకీయాల్లో కీలకమని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి, వారి సమస్యలను తీర్చేలా కృషి చేయాలని, వారికి తోడుగా నిలబడాలని సూచించారు. “ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. సమస్యలలో అండగా నిలబడినప్పుడే నిజమైన నాయకుడిగా ఎదగగలరు. ప్రతి ఒక్కరు తమ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి” అని ఆయన హితవు పలికారు.









