ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఓ కీలక అధికారి పేరును ఉపయోగించి వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమురు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని వ్యాపార సంస్థలపై లక్ష్యంగా పెట్టుకుని సీఎం ఓఎస్డీగా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి, నకిలీ అకౌంట్లు, ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని యవ్వారిపేటకు చెందిన నాగరాజు, తాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకాధికారులు (ఓఎస్డీ)నని చెప్పి ర్యాపిడో, కంట్రీ డిలైట్ వంటి ప్రముఖ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లతో మాట్లాడినట్లు గుర్తించారు. వాట్సాప్ సందేశాలు, నకిలీ ఈమెయిల్ ఐడీ ద్వారా పలు రియల్ ఎస్టేట్ సంస్థల ఛైర్మన్‌లకు బెదిరింపులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంతో అతడు స్వయంగా ప్రభుత్వంతో సంబంధాలున్నట్టు నమ్మబలికేందుకు ప్రయత్నించాడు.
దర్యాప్తులో భాగంగా నాగరాజు ఓ నకిలీ ఈమెయిల్ ఐడీను సృష్టించి దాని ద్వారా అధికారిక కమ్యూనికేషన్‌లను పంపుతున్నట్లు వెల్లడైంది. ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా వెళ్లి నాగరాజును అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు. నాగరాజు ఈ మోసాలకు కొంత కాలంగా పాల్పడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది మొదటిసారి కాదు, బుడుమూరు నాగరాజు గతంలోనూ పలు నేరాలకీ సంబంధం కలిగి ఉన్నాడు. 2023లో శ్రీకాకుళం ప్రాంతంలో 22 కిలోల గంజాయిని అక్రమంగా తరలించబోతున్న సందర్భంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాక, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టిన వ్యవహారం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ కేసులను తరువాత వెనక్కి తీసుకున్న నాగరాజు మళ్లీ మోసాలకు పాల్పడుతుండడం అధికారులు ఆందోళనగా చూస్తున్నారు.









