దేవరకొండ పట్టణంలో మానవత్వం ప్రతిబింబించిన స్ఫూర్తిదాయక ఘటన వెలుగుచూసింది. పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన అనిత అనే గృహిణి గత కొద్ది రోజుల క్రితం కాలేయ క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోయింది. తల్లి మరణంతో చిన్నారి భవిష్యత్తు అనిశ్చితిలో నిలిచిపోయింది. కుటుంబంలో ఆదరాభావం లేక ఒంటరిగా మిగిలిపోయిన ఆ చిన్నారి పరిస్థితి స్థానికులను కలచివేసింది.
ఈ ఘటన గురించి తెలుసుకున్న దేవరకొండకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. కృష్ణ స్పందించారు. మానవతా భావంతో ముందుకు వచ్చిన ఆయన సంజీవని హాస్పిటల్ తరఫున రూ.10,000 చెక్కును ఆ చిన్నారికి అందించి ఆదుకున్నారు. వైద్య వృత్తిని కేవలం జీవనాధారంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా భావించాలన్న తన నిబద్ధతను మరోసారి ప్రదర్శించారు.
పేద ప్రజలకు, సహాయం కోరే కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వచ్చే డా. కృష్ణ ఈసారి మరోసారి తన సేవా మనసును చాటుకున్నారు. ఇంతకు ముందు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి, పేద రోగులకు ఉచిత చికిత్స, మందులు అందించి దేవరకొండ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు.
డా. కృష్ణ చేసిన ఈ సేవా చర్యకు పట్టణంలోని పలువురు ప్రముఖులు, సేవాసంస్థల ప్రతినిధులు మరియు సామాజిక నాయకులు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి మానవతా దృక్పథం ఉన్నవాళ్ల వల్లే సమాజం బతుకుతోంది” అంటూ ఆయన ధాతృత్వాన్ని ప్రశంసించారు. చిన్నారి భవిష్యత్తు కోసం ముందుకు వచ్చిన డా. కృష్ణ ఉదాత్తత ప్రజలకు స్ఫూర్తిగా మారింది.









