సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు సంక్షోభంలో!

Experts warn that AI and LLMs are threatening software jobs, signaling the end of the high-salary era for engineers.

ఓ సమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనగానే గౌరవంగా, గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే, ఈ రంగంలో ఉన్నవారికి అధిక జీతాలు, హైలైఫ్ అనుభవాలు అందుబాటులో ఉండేవి. కానీ, రోజులు మారాయి. ఇప్పుడది గడచిపోయిన స్వప్నంగా మారుతోంది. కొత్త టెక్నాలజీల రాకతో సాఫ్ట్‌వేర్ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి.

జోహో సీఈవో శ్రీధర్ వెంబు స్పష్టంగా చెప్పారు – సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇక శాశ్వతం కావని, AI, LLMలు లాంటి టెక్నాలజీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను ప్రభావితం చేస్తున్నాయని. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీతాలు మిగతా రంగాలపై ఓ అధికారం లాంటివిగా మారినా, ఇది స్థిరంగా ఉండదని ఆయన హెచ్చరించారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకపాత్ర పోషిస్తున్నందున, ఇది మానవ మూలధనాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది.

IMF తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలపై AI ప్రభావం చూపించబోతుందని తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఇది ఏకంగా 60 శాతం వరకు ఉండనుంది. ఈ పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకుని తాము ఆ మార్పుకు తగినట్టు మలచుకున్నవారికే భవిష్యత్తు ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే కోడింగ్ పనిని AIతో తక్కువ సమయంలో పూర్తి చేసే టూల్స్‌ను అభివృద్ధి చేశాయి. దీంతో ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇదే దారిలో మరిన్ని కంపెనీలు వెళ్తున్నాయని సమాచారం. అటు ఉద్యోగ కోతలు, ఇటు టెక్నాలజీ పెరుగుదల మధ్య, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారనుంది. కలల ప్రపంచం అనిపించిన ఈ రంగం భవిష్యత్తులో అస్థిరతల ముంగిట నిలబడనుందన్నది స్పష్టమవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share