భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో, ఎంపీడీవో ఆఫీస్ వెనుక పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో రాహుల్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ జిమ్ భద్రాచలం అభివృద్ధికి మరో అడుగు అని భావిస్తున్నారు.
జిమ్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు పీవో రాహుల్, ప్రజలు ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో వ్యాయామం చేయడానికి ఇది ఎంతో సహాయపడుతుందని అన్నారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవితశైలికి ఈ జిమ్ ఉపయోగపడుతుందని, యువత మాత్రమే కాదు అన్ని వయస్సుల వారూ దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. పల్లె ప్రకృతి వనంలో ఉండటం వల్ల ఈ జిమ్ ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిమ్ ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతుల కోసం కేటాయింపులు పెంచుతూ భద్రాచలాన్ని అభివృద్ధి పట్టాలపై నడిపిస్తున్నారని స్థానికులు అంటున్నారు. క్రీడా సదుపాయాలు, పార్కులు, రహదారులు, నీటి వసతుల అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే చూపుతున్న శ్రద్ధ ప్రజాదరణను పెంచుతోంది.
అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తూ ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును స్థానికులు విశేషంగా ప్రశంసిస్తున్నారు. ఆరోగ్యం, పర్యావరణం, మౌలిక వసతుల ఏర్పాటులో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భద్రాచలం ముందంజలో ఉందని పేర్కొంటున్నారు. ఈ ఓపెన్ జిమ్ ప్రారంభం భద్రాచల ప్రజల ఆరోగ్యాభివృద్ధికి ఒక మంచి అడుగుగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.









