కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు, కానీ రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు” అంటూ రాజీ మార్గమే రాజ మార్గమని శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ డి.సైదులు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నవంబర్ 15న నకిరేకల్ కోర్టులో నిర్వహించబోయే ప్రత్యేక లోక్ అదాలత్‌లో కక్షిదారులు తప్పనిసరిగా పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా సమన్యాయం, సత్వర న్యాయం సాధ్యమవుతుందని ఎస్‌ఐ సైదులు తెలిపారు. రాజీ మార్గం ద్వారానే రెండు పక్షాలు గెలిచినట్లవుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవడం సమాజానికి మేలని అన్నారు. కోర్టుల్లో చిన్న చిన్న కేసులతో సమయం, డబ్బులు వృథా చేసుకోవద్దని, అందరూ రాజీకి ముందుకు రావాలని ఆయన సూచించారు.
ఈ జాతీయ మెగా లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబ పరమైన నిర్వహణ, వైవాహిక జీవితం, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఎస్‌ఐ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో పాల్గొనడం వల్ల న్యాయవ్యవస్థపై ఒత్తిడి తగ్గి, ప్రజలకు తక్షణ న్యాయం అందుతుందని ఆయన వివరించారు.
చిన్న చిన్న తగాదాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని సైదులు అన్నారు. “కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దు. జుడీషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి” అని ఆయన పిలుపునిచ్చారు. రాజీ మార్గం ద్వారా సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొంటుందని ఆయన తెలిపారు.









