రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో, రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 ను డిసెంబర్ 8, 9న రెండు రోజుల పాటు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. సమ్మిట్ కోసం ప్రత్యేకంగా లోగోను కూడా ఈ రోజు విడుదల చేశారు.
సమ్మిట్ భారత ఫ్యూచర్ సిటీలో జరుగనున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానికంగా ఏర్పాట్లను పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులు దిశానిర్దేశం చేశారు.
మొదటి రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల, కార్యక్రమాల గురించి వివరించనుంది. రెండో రోజు తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్-2047’ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. వివిధ విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలను ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్ల ద్వారా వివరించనున్నారు.
వేదికకు హాజరయ్యే అంతర్జాతీయ అతిథులు, అంబాసిడర్లు, ఉన్నత ప్రతినిధులకు వసతి సదుపాయాలు, భద్రతను కల్పించడానికి పోలీసులు, అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమ్మిట్ రాష్ట్రాభివృద్ధి, వ్యాపార, అంతర్జాతీయ ప్రమాణాలను పెంపొందించడంలో కీలకంగా నిలవనుంది.









