యువత భవిష్యత్తు కోసం కఠిన చర్యలు

Minister Adluri Lakshman said Telangana is cracking down on drugs with strong action, and the Eagle unit is playing a key role in curbing the drug network.

డ్రగ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మత్తు రహిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. సరదాగా మొదలయ్యే చెడు అలవాట్లు యువజీవితాలను నాశనం చేస్తున్నాయని, చదువు–లక్ష్యాలపై దృష్టి పెట్టాలంటే డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని యువతకు సూచించారు. “డ్రగ్స్‌కు దూరంగా… లక్ష్యాలకు దగ్గరగా” అనే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల సరఫరా మార్గాలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈగిల్ స్పెషల్ యూనిట్ డ్రగ్స్ రవాణా, ఆన్‌లైన్ లావాదేవీలు, డార్క్‌నెట్ కార్యకలాపాలు వంటి వాటిపై కఠిన నిఘా పెట్టినట్లు వివరించారు. రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్, డేటా విశ్లేషణ, వేగవంతమైన ఆపరేషన్లతో ఈగిల్ యూనిట్ రాష్ట్ర పోలీసింగ్‌కు కొత్త దిశను నిర్దేశించిందని చెప్పారు. నేర ప్రపంచాన్ని అణచివేయడంలో ప్రభుత్వం ఒక్కో దశలో ముందుకు సాగుతోందని అన్నారు.

మత్తునిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఎంబీఏ కమిటీలు ఏర్పాటు చేసి, విద్యాసంస్థల్లో క్లబ్‌లు స్థాపించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 15,891 విద్యాసంస్థల్లో 7,018 కార్యక్రమాల ద్వారా 1.45 కోట్ల మందికి పైగా అవగాహన కల్పించామని చెప్పారు. మత్తు వ్యసనం వ్యక్తిగత సమస్య కాదు, కుటుంబాలను కూల్చివేసే అగ్నికీల అని హెచ్చరించారు. యువత రక్షణ అంటే తెలంగాణ భవిష్యత్తు రక్షణ అని, అందుకే ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సేవలు, క్రీడలు–సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సమాజంలోని ప్రతి వర్గం మత్తునిరోధక ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. “డ్రగ్స్‌కు దూరంగా… కెరీర్‌కు దగ్గరగా, విజయాలకు దగ్గరగా” అనే నినాదాన్ని విద్యార్థులు జీవన సూత్రంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మత్తునిర్మూలన సేవలందిస్తున్న వాలంటీర్లను సన్మానించారు. వైద్య విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించి, ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share