భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాశ్చాత్య విమానయాన సంస్థలు పాక్ గగనతలాన్ని స్వచ్ఛందంగా దాటకుండా నిర్ణయం తీసుకున్నాయి. లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్, ఎయిర్ ఫ్రాన్స్ వంటి సంస్థలు గత రెండు రోజులుగా తమ విమానాల మార్గాలను మార్చాయి. ఇది భద్రతా పరంగా ముందు జాగ్రత్త చర్యగా పేర్కొంటున్నారు.
పాక్ గగనతలాన్ని ఉపయోగించకపోవడం వల్ల యూరప్-భారత్ మధ్య ప్రయాణించే విమానాల సమయం సగటున గంట వరకు పెరుగుతోంది. ఇది పెరిగిన ఇంధన ఖర్చులకు దారితీస్తోంది. దీంతో, ఆ ఖర్చు ప్రయాణికులపై టికెట్ ధరల రూపంలో మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్థాన్‌కు ఈ పరిణామం ఆర్థికపరంగా భారీ నష్టాన్ని కలిగించనుంది. వాణిజ్య విమానాల గగనతల వినియోగానికి ఓవర్‌ఫ్లైట్ రుసుములు వసూలు చేస్తూ వస్తున్న పాక్, ఇప్పుడు ఆ ఆదాయాన్ని కోల్పోతుంది. గతంలో 2019 బాలాకోట్ దాడుల అనంతరం గగనతలాన్ని మూసి పెట్టినప్పుడు సుమారు 100 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం, భారత్-పాక్ పరస్పర గగనతలాలను మూసివేసుకోవడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇప్పుడు పాశ్చాత్య సంస్థలు కూడా పాక్ గగనతలాన్ని వదులుకోవడం, దేశ భద్రతతో పాటు ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.









