బంగ్లాదేశ్‌లోని ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్‌కు ఢాకా హైకోర్టు భారీ ఊరట కల్పించింది. దేశద్రోహం ఆరోపణలపై నడుస్తున్న కేసులో బెయిల్ మంజూరైంది. జస్టిస్ అతోర్ రెహమాన్, జస్టిస్ అలీ రెజాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ నుంచి జైలులో ఉన్న చిన్మోయ్‌కు ఇది మొదటి సానుకూల అభివృద్ధిగా భావిస్తున్నారు.
నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బంగ్లాదేశ్, అంతర్జాతీయ స్థాయిలో హిందూ సంఘాలు, మానవహక్కుల సంస్థలు ఆయన విడుదల కోసం ఉద్యమించాయి. ఆయన బంగ్లాదేశ్ సమ్మిలితో సనాతనీ జాగరణ్ జోట్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ కేసుపై హైకోర్టు విచారణ పూర్తిచేసి బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యమైన పరిణామంగా అభిప్రాయపడుతున్నారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పదవి నుంచి తప్పుకున్న తర్వాత, మైనారిటీలపై దాడులు అధికమయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇళ్లు, దేవాలయాలు, వ్యాపారాలపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిన్మోయ్ దాస్‌కు బెయిల్ లభించడాన్ని మైనారిటీల హక్కుల పరిరక్షణ దిశగా ముందడుగుగా విశ్లేషిస్తున్నారు.
ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్‌టెక్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్‌తో మైనారిటీల భద్రత అంశాన్ని ప్రస్తావించారు. భారత్ ఇప్పటికే హిందువులపై దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మోయ్ దాస్‌కు బెయిల్ రావడంతో హిందూ సమాజం ఊపిరి పీల్చుకుంది.









