ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ త్వరలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు దేశంలో పర్యటించనున్న ఆయన, తన పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువై ఉన్న శ్రీరామ మందిరాన్ని దర్శించనున్నారు. ఇది ఆయన వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణంతో పాటు, భారత్ పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనంగా మారింది.
హర్యానాలో ప్రధాన కార్యాలయం కలిగిన సోలార్ ఈవీ ఛార్జింగ్ పరికరాల సంస్థ ‘సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్’ ఎరాల్ మస్క్‌ను ఈ నెల 5వ తేదీన గ్లోబల్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమించింది. ఈ నియామకం అనంతరం, సంస్థ ఆహ్వానంతో ఆయన భారతదేశ పర్యటనకు సిద్ధమయ్యారు. పర్యటనలో భాగంగా సెర్వోటెక్ నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎరాల్ మస్క్, సంస్థ వ్యాపార లక్ష్యాలు, సాంకేతిక విజ్ఞానంపై దృష్టి సారించనున్నారు.
ఈ సందర్భంగా, ఆయన పలు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యే అవకాశముంది. గ్రీన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎగుమతులపై ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది. భారతదేశంలో గణనీయంగా పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, మౌలిక వసతుల విస్తరణపై ఈ భేటీలు కీలకంగా మారనున్నాయి.
భారత్ పర్యటన పూర్తయిన అనంతరం జూన్ 6వ తేదీన ఎరాల్ మస్క్ దక్షిణాఫ్రికాకు తిరుగుముఖం పడనున్నారు. ఈ పర్యటన భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే అవకాశమున్నదిగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పర్యటనతో భారత్–అంతర్జాతీయ టెక్నాలజీ భాగస్వామ్యాల్లో కొత్త అధ్యాయం మొదలవనుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి.









