ఆస్ట్రేలియా ఆగ్నేయ ప్రాంతం విపరీత వర్షాలతో తీవ్రంగా ప్రభావితమవుతోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, ప్రజల జీవనం పూర్తిగా స్థంభించింది. శుక్రవారం వరద నీటిలో చిక్కుకున్న కారులో ఒక మృతదేహాన్ని గుర్తించడంతో మృతుల సంఖ్య నలుగుకి చేరింది. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ విపత్కర పరిస్థితుల వల్ల దాదాపు 50,000 మందికి పైగా ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. అత్యవసర సేవల బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే, వరదలు తగ్గుతున్న కొద్దీ ఇళ్లకు తిరిగి వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం, విషపూరిత పురుగులు, భద్రతా సమస్యలు భవిష్యత్లో తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
రాష్ట్ర అత్యవసర సేవల ఉప కమిషనర్ డేమియన్ జాన్స్టన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “వరద నీటిలో అనేక ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, విషపూరిత జంతువులు ఉండే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ సరఫరా కూడా ప్రమాదకరంగా మారవచ్చు” అని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని సూచించారు.
న్యూసౌత్వేల్స్లోని హంటర్, మిడ్ నార్త్ కోస్ట్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. అనేక రహదారులు నీటిలో మునిగిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వరద తీవ్రత ఎక్కువగా ఉన్న టారీ పట్టణ పర్యటనను రద్దు చేసుకున్నారు. మైట్లాండ్ పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ, “ఈ పరిస్థితిని నివారించడానికి మేము కృషి చేశాం కానీ ప్రకృతి ముందు మనం బలహీనులం” అని పేర్కొన్నారు. ప్రజలు సహనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









