ప్రముఖ హాస్య నటుడు, వ్యాఖ్యాత కపిల్ శర్మకు కెనడాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఆయన సర్రే నగరంలో ప్రారంభించిన కేఫ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికులను కలవరపెట్టింది. కాల్పుల ఘటనపై కెనడా పోలీసులు గట్టిగా స్పందించి, విచారణ ప్రారంభించారు.
ఒక కారు మీదుగా వచ్చిన దుండగుడు కపిల్ శర్మ కేఫ్‌ను లక్ష్యంగా చేసుకుని మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన సిసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అదృష్టవశాత్తు, కాల్పులు జరిగిన సమయంలో కేఫ్ ప్రాంతంలో ఎవ్వరూ లేరు, అందువల్ల ఎలాంటి ప్రాణహానీ జరగలేదు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాల్పుల వెనుక కారణాలు, మోటివ్ ఏమిటన్న దానిపై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో కపిల్ శర్మ అభిమానుల్లో ఆందోళన ఏర్పడింది. కపిల్ ఇంకా దీనిపై అధికారికంగా స్పందించలేదు.
ఇంతలో ఖలిస్థానీ తీవ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ఈ దాడికి తానే బాధ్యుడినని సోషల్ మీడియాలో ప్రకటించుకున్నట్లు సమాచారం. అతను బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే నిషేధిత సంస్థకు చెందిన కీలక నేత. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అతన్ని మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంచింది. ఈ నేపథ్యంలో ఈ దాడికి అంతర్జాతీయ మద్దతు ఉన్నదా? లేక ఇది వ్యాపార విరోధుల కుట్రా? అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.









