ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, వారి బానిసత్వంలో మగ్గిపోవడం కన్నా జైలులో చీకటి గదిలోనే జీవించడం మేలని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఈ దుష్ట పాలకులపై పోరాటం చేయాలని ఆయన కోరారు.
ఇమ్రాన్ ఖాన్ విడుదల చేసిన వీడియో సందేశంలో పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 26వ రాజ్యాంగ సవరణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సవరణతో ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటు హక్కు, చట్టబద్ధ పాలన, నైతిక విలువలు, మీడియా స్వేచ్ఛ వంటి నాలుగు స్తంభాలు ధ్వంసమయ్యాయని మండిపడ్డారు. జూలై 6 నుంచి దేశ వ్యాప్తంగా నిరసనలు నిర్వహించి ఈ సవరణకు వ్యతిరేకంగా కఠినంగా పోరాటం చేయాలని పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ఒక నియంత అధికారంలోకి వస్తే ప్రజల ఓట్లతో పని ఉండదు. తన ఇష్టానుసారం విధానాలను అమలు చేస్తూ, నిరంకుశ పాలన కొనసాగిస్తాడు” అని పరోక్షంగా విమర్శించారు. ఈ విధమైన పరిస్థితులు పాక్ ప్రజాస్వామ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ న్యాయ వ్యవస్థపై కూడా ఇమ్రాన్ కఠిన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాల్లో స్వతంత్రంగా వ్యవహరించే న్యాయమూర్తులు లేకుండా ఎంచుకున్న జడ్జీలు మాత్రమే ఉన్నారని, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. తన సందేశాలను ప్రజలకు చేరకుండా ప్రభుత్వం అన్ని మార్గాల్లో అడ్డుకుంటోందని, ఇది పాక్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకే పెద్ద ఇబ్బంది అని ఆయన చెప్పారు.









