గుజరాత్‌కు చెందిన 38 ఏళ్ల ముస్తకీం భాతియారా అనే భారతీయ వంటమనిషికి కువైట్‌లో యజమాని హత్య కేసులో మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 28న ఈ శిక్షను కువైట్‌లో అమలు చేయగా, ముస్తకీం మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. అనంతరం బుధవారం స్వగ్రామమైన కపడ్వంజ్లో ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ముస్తకీం గత ఏడేళ్లుగా కువైట్‌లో రెహానా ఖాన్ అనే మహిళ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. 2019లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ముస్తకీం తన యజమాని రెహానా ఖాన్‌ను కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం అతనిని అరెస్ట్ చేసి, 2021లో న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
ముస్తకీం గతంలో దుబాయ్, బహ్రెయిన్ దేశాల్లో కూడా వంట పనులకు పనిచేశాడు. అతనికి కువైట్‌లో ఉద్యోగం రాజస్థాన్‌కు చెందిన ఓ జంట ద్వారా లభించినట్లు సమాచారం. రెహానా ఖాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో జరిగిన విచారణలో ముస్తకీం పైన హత్యారోపణలు రుజువయ్యాయి.
భారత రాయబార కార్యాలయం ఈ సమాచారం అతని కుటుంబ సభ్యులకు అందించగా, మృతదేహాన్ని అహ్మదాబాద్‌కు తరలించి, అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఆవేదన మధ్య ముస్తకీం అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి.









