రష్యా తన పరిశ్రమల్లో కార్మికుల కొరతను తీర్చేందుకు భారత్ వైపు మొగ్గు చూపుతోంది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించాలనే యోచనలో ఉంది. ముఖ్యంగా యాకటెరిన్‌బర్గ్ ప్రాంతంలోని భారీ పరిశ్రమలు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఎక్కువ కార్మికుల అవసరాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ మేరకు యాకటెరిన్‌బర్గ్ నగరంలో కొత్తగా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ బెసెడిన్ తెలిపారు. ఈ కార్యాలయం భారతీయ వలస కార్మికులకు సంబంధించిన అనేక అంశాలను, వీసా ప్రక్రియలు, కాంట్రాక్టుల స్పష్టత, వసతి, భద్రత వంటి విషయాలను పర్యవేక్షిస్తుంది. భారత ప్రభుత్వంతో సమన్వయం జరిపి వలసదారుల సంక్షేమాన్ని కాపాడేలా రష్యా యత్నిస్తోంది.
యాకటెరిన్‌బర్గ్ ప్రాంతం రష్యాలో అత్యంత పరిశ్రమలతో నిండిన ప్రాంతాల్లో ఒకటి. ఉరాల్ పర్వతాల సమీపంలోని ఈ ప్రాంతం మిలిటరీ సామాగ్రి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ఈ పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలంటే నైపుణ్యం గల కార్మికులు అత్యంత అవసరమవుతున్నారు. అందుకే భారత్, శ్రీలంక, ఉత్తర కొరియా లాంటి దేశాల నుండి కార్మికులను రప్పించాలని నిర్ణయించారు.
ఇప్పటికే కొంతమంది భారతీయులు రష్యాలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అయితే ఈసారి లక్షల సంఖ్యలో నైపుణ్యం గల ఉద్యోగులకు అవకాశాలు రావడం ప్రత్యేకం. ఉద్యోగాలు పొందే అవకాశం ఉన్న కార్మికులు సాధారణంగా మెషిన్ ఆపరేటర్లు, వెల్డర్లు, టెక్నీషియన్లు, నిర్మాణ కార్మికులు వంటి రంగాల్లో నైపుణ్యం కలిగినవారు కావడం గమనార్హం. రష్యాలో కార్మిక అవసరం పెరగడంతో, ఇది భారత యువతకు కొత్త అవకాశాలకు ద్వారమవుతుంది.









