భారత్ లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలను నిర్మూలించేందుకు భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్ మద్దతుతో నడుస్తున్న ఉగ్ర శిక్షణా శిబిరాల గుట్టురట్టు అయింది. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కలిసికట్టుగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్ర సంస్థలకు ఆర్థిక, మౌలిక, సైనిక సహాయం అందిస్తున్నాయని తాజా నివేదికలు వెల్లడించాయి. పీఓకేలోని వివిధ శిబిరాల్లో ఉగ్రవాదులు ప్రత్యక్షంగా శిక్షణ పొందుతున్న తీరు, ఆయుధాల వినియోగంపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్న తీరును ఈ ఆపరేషన్ వెల్లడి చేసింది.
ఎఫ్‌ఏటీఎఫ్ ఆంక్షల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు కొత్త పేర్లు పెట్టడం, వాటిని ‘ప్రతిఘటన ఉద్యమాలు’గా చిత్రీకరించడం వంటి పాక్ వ్యూహాలు బయటపడ్డాయి. మర్కజ్ తైబా, మర్కజ్ సుభాన్ అల్లా వంటి శిబిరాలు కేవలం శిక్షణ కేంద్రాలుగా మాత్రమే కాకుండా, తీవ్రవాద బోధనల కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ ప్రాంగణాల్లో పనిచేస్తున్న శిబిరాలు రక్షణ కేంద్రాలుగా వలిపోతున్నాయి. లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ పరికరాలు, డ్రోన్లు, సిగ్నల్ బూస్టింగ్ టెక్నాలజీతో LOC చొరబాట్లను సులభతరం చేస్తున్నాయని సమాచారం.
జేఈఎం, ఎల్‌ఈటీ శిబిరాలు జమ్మూ-కశ్మీర్‌లోకి చొరబాట్లకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. సర్జల్ తెహ్రా కలాన్, మెహమూనా జోయా ఫెసిలిటీ వంటి శిబిరాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వెనుక పనిచేస్తూ ఉగ్రవాదులకు రహస్యంగా ఆశ్రయం కల్పిస్తున్నాయి. పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లోకి చొరబాట్ల కోసం గుట్టుగా తవ్విన సొరంగాలు, డ్రోన్ మార్గాలు పాక్-ఐఎస్ఐ వ్యూహాన్ని నిరూపిస్తున్నాయి. పీఓకేలోని కొన్నిశాల శిబిరాలు, వాస్తవానికి పాక్ సైన్యం ఆమోదంతో నడుస్తున్న ‘ఉగ్ర యూనివర్సిటీలు’గా నిలుస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
ఈ వివరాలు పాక్‌లోని మర్కజ్‌లు, డిటాచ్‌మెంట్లు, లాంచ్ ప్యాడ్లు, శిక్షణా శిబిరాలు వంటి మౌలిక సదుపాయాలు ISI, పాక్ సైన్యం సాయంతో ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రాలుగా ఎలా ఉపయోగపడుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ద్వారా ఈ వ్యవస్థ గుట్టురట్టు కావడం, భవిష్యత్తులో చొరబాట్లకు అడ్డుకట్ట వేయడంలో కీలకమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చర్యలతో భద్రతా పరంగా భారత్ ఉన్న స్థిర సంకల్పాన్ని పాక్‌కు మరోసారి చాటిచెప్పినట్లయింది.









