పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం నెలకొన్న పరిస్థితుల్లో, కర్ణాటకలోని మంగళూరులో ఒక వ్యక్తిపై జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుడుపు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిపై కొందరు ఆగ్రహంతో దాడికి దిగారు.
ఆ వాగ్వాదం అల్లర్లుగా మారింది. సచిన్ అనే యువకుడితో మొదలైన వివాదం, కొద్ది గంటల్లోనే ఘర్షణకు దారి తీసింది. పలువురు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. మృతుడిని వదిలిపెట్టకుండా కాళ్లతో తన్ని, వెన్నుపై పదే పదే కొట్టారు. ఆ ఘటన అనంతరం సాయంత్రం ఆలయ సమీపంలో బాధితుడి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హోం మంత్రి జి. పరమేశ్వర ఘటనపై స్పందిస్తూ, క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ‘పాక్ జిందాబాద్’ అంటూ నినాదం చేసినట్టు సమాచారం ఉందన్నారు. దానికి ప్రతిగా కొందరు దాడికి పాల్పడి, బాధితుడు మృతి చెందాడని తెలిపారు. ఇప్పటివరకు 10–12 మందిని అరెస్టు చేశామని తెలిపారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితుల గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ప్రధాన నిందితుడు సచిన్‌తో పాటు పలువురు ఇప్పటికే అదుపులో ఉన్నారు. ఐపీసీకి బదులుగా కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. మరికొంతమంది పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.









