భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తోంది. పాక్ ప్రభుత్వం వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రక్షణ ఖర్చును 18 శాతం పెంచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండగా, రుణ భారం ఎక్కువై ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతుండగా.. సైనిక ఖర్చులను మరింత పెంచడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావర్ భుట్టో జర్ధారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైంది. బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించగా, రూ.17.5 ట్రిలియన్ల విలువైన బడ్జెట్‌కు రూపకల్పన జరిగింది. ఇందులో రక్షణ వ్యయాన్ని రూ.2.5 ట్రిలియన్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
గత ఏడాది రక్షణ శాఖకు రూ.2,122 బిలియన్లు కేటాయించగా, ఈసారి దాదాపు రూ.400 బిలియన్ల పెంపుతో రక్షణ వ్యయం భారీ స్థాయికి చేరనుంది. పాక్ బడ్జెట్‌లో రుణ చెల్లింపులు తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో రక్షణ వ్యయం ఉంది. ఈ ఏడాది పాకిస్థాన్ రూ.9,700 బిలియన్లను రుణాల చెల్లింపులకు కేటాయించింది, ఇది ఆర్థిక సంక్షోభ తీవ్రతను సూచిస్తోంది.
ఇక దేశ ప్రజలు నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్నారు. అయినప్పటికీ ప్రజల అవసరాలకు మించి సైనిక వ్యవస్థను బలోపేతం చేయడం పాక్ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇది భారత్‌పై భయంతో తీసుకున్న నిర్ణయంగా విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్ ఈ విధంగా రక్షణ వ్యయాన్ని పెంచడం దక్షిణాసియా ప్రాంతంలో శాంతికి ముప్పుగా మారే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.









