గూగుల్ ఏఐ భద్రత హామీలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ లండన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పాజ్ఏఐ (PauseAI) అనే కార్యకర్తల సంస్థ ఆధ్వర్యంలో 60 మందికి పైగా నిరసనకారులు గూగుల్ డీప్ మైండ్ ప్రధాన కార్యాలయం ఎదుట సమావేశమయ్యారు. ఈ నిరసనలో ప్రత్యేక ఆకర్షణగా జడ్జి, జ్యూరీలతో కూడిన ఒక నమూనా కోర్టును (మాక్ ట్రయల్) ఏర్పాటు చేసి గూగుల్‌పై ‘ప్రతీకాత్మక’ంగా విచారణ జరిపారు. ‘‘ఊహించొద్దు, పరీక్షించండి’’, ‘‘ఈ పరుగు ఆపండి, ఇది సురక్షితం కాదు’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నిరసనకారులు 2024లో సియోల్‌లో జరిగిన ఏఐ భద్రతా సదస్సులో గూగుల్ ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. గూగుల్ తాము అభివృద్ధి చేస్తున్న ఏఐ మోడళ్లను బహిరంగంగా పరీక్షించి, బయట నిపుణుల సమీక్షకు అవకాశం ఇస్తామని, పారదర్శకత నివేదికలను ప్రచురిస్తామని అప్పుడు ప్రకటించిందని వారు పేర్కొన్నారు. కానీ ఏప్రిల్‌లో విడుదల చేసిన జెమిని 2.5 ప్రో మోడల్ విషయంలో గూగుల్ ఈ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
జెమిని 2.5 ప్రోను ‘ప్రయోగాత్మక మోడల్’గా ప్రకటించిన గూగుల్, ప్రారంభ దశలో ఎలాంటి థర్డ్ పార్టీ సమీక్ష వివరాలను అందించలేదని నిరసనకారులు చెప్పారు. ఆ తర్వాత విడుదల చేసిన భద్రతా నివేదికలోనూ బయట సమీక్షకుల వివరాలు లేకపోవడం, సరైన విశ్లేషణ లేకపోవడం ఆందోళనకు గురి చేసిందని వారు తెలిపారు. నిపుణులు సైతం గూగుల్ పారదర్శకత లోపాలను విమర్శిస్తున్నారని పాజ్ఏఐ సభ్యులు చెప్పారు.
పాజ్ఏఐ ఆర్గనైజింగ్ డైరెక్టర్ ఎల్లా హ్యూస్ మాట్లాడుతూ “మన దేశంలో ఒక సాండ్విచ్ షాపుపై ఉన్న నియంత్రణ కూడా ఏఐ కంపెనీలపై లేదు. గూగుల్ ఇలా మాట తప్పితే భద్రతా హామీలు లెక్కచేయాల్సిన అవసరం లేదన్న సంకేతం ఇతర ఏఐ కంపెనీలకు వెళ్తుంది” అని అన్నారు. పాజ్ఏఐ వ్యవస్థాపకుడు జోప్ మాట్లాడుతూ పారదర్శకత అంశాన్ని రాజకీయ స్థాయికి తీసుకెళ్లేందుకు బ్రిటన్ ఎంపీలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ నిరసనలపై గూగుల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.









