ఒకప్పుడు పాకిస్థాన్ ఆర్థికంగా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు మించి ఉండేది. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, తమిళనాడు రాష్ట్ర జీడీపీ పాకిస్థాన్ మొత్తం దేశ జీడీపీని మించి పోయింది. ఇది ఆర్థిక ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జనాభాలో పాకిస్థాన్ తమిళనాడుకు మూడింతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం తమిళనాడు బలంగా నిలిచింది.
1995లో పాకిస్థాన్ జీడీపీ 57.9 బిలియన్ డాలర్లుగా ఉండగా, తమిళనాడు జీడీపీ కేవలం 15.7 బిలియన్ డాలర్లు మాత్రమే. కానీ 2025 నాటికి ఈ సమీకరణం పూర్తిగా తారుమారైంది. తాజాగా తమిళనాడు జీడీపీ 419.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా, పాకిస్థాన్ జీడీపీ మాత్రం 397.5 బిలియన్ డాలర్ల వద్దే నిలిచిపోయింది. ఇది రాష్ట్ర స్థాయి అభివృద్ధి ఎలా దేశ స్థాయిని అధిగమించవచ్చో సూచిస్తోంది.
ఇక, సగటు వ్యక్తి ఆదాయం పరంగా చూసినట్లయితే, తమిళనాడు ప్రజలు పాకిస్థాన్ వాసుల కంటే మూడింతలు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇది పరిశ్రమలు, ఐటీ, తయారీ రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతికి నిదర్శనం. విద్య, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల వృద్ధికి తమిళనాడు ప్రాధాన్యత ఇవ్వడం ఈ విజయానికి కారణంగా చెబుతున్నారు.
ఈ పరిణామాలపై నౌక్రీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీ స్పందిస్తూ, పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద మద్దతు, కశ్మీర్ రాజకీయాలపై కాకుండా, ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇది సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చగా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ, “గుజరాత్, కర్ణాటక లాంటి రాష్ట్రాలు కూడా ఇప్పటికే పాకిస్థాన్ జీడీపీని దాటేశాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.









