మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో సమగ్ర శిక్ష నిధులు రూ. 2.55 కోట్లతో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రారంభోత్సవానికి బుధవారం కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం. వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి పాఠశాలను ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. అన్ని వర్గాల సంక్షేమం దిశగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. నిరుపేద, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, కనీస మౌలిక వసతులు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.
వసతి గృహాలు, హాస్టల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక మెనూ ప్రవేశపెట్టి, నాణ్యమైన భోజనం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జైపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన KGBV హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనకు కీలకంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఇతర సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.









