బాలీవుడ్ మెగాస్టార్ ఆమిర్ ఖాన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై బహిరంగంగా స్పందించారు. “లవ్ జిహాద్” అన్న దానిని ప్రతి మతాంతర వివాహంతో కలిపి చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేమ అనేది మతాలతో సంబంధం లేకుండా వ్యక్తిగత నిర్ణయం అని, తన కుటుంబంలో కూడా ఇలాంటి వివాహాలు జరిగాయని పేర్కొన్నారు. ఆయన కుమార్తె ఐరా ఖాన్ హిందూ యువకుడిని పెళ్లి చేసుకున్నారని, తన సోదరులు కూడా మతాంతర వివాహాలు చేసుకున్నారని ఉదాహరణలు పేర్కొన్నారు.
ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమా ఏ మతాన్ని లక్ష్యంగా చేయలేదని, మతం పేరుతో ప్రజలను మోసం చేసే వ్యక్తులపై విమర్శించామని అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత ఖాన్ త్రయం స్పందించలేదన్న ఆరోపణలపైనా ఆయన స్పష్టత ఇచ్చారు. 1999లో వచ్చిన ‘సర్ఫరోష్’ సినిమాలో పాకిస్థాన్‌ను శత్రుదేశంగా చూపించి తొలిసారిగా బాలీవుడ్ దేశభక్తిని చాటిందని గుర్తుచేశారు. ఆ సినిమాకు అప్పట్లో పాకిస్థాన్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయని చెప్పారు.
‘దంగల్’ సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేయాలన్నప్పుడు, అక్కడి సెన్సార్ బోర్డు భారత జాతీయ గీతం, జెండాను తొలగించాలని షరతులు పెట్టినట్లు ఆమిర్ వెల్లడించారు. కానీ తాను దేశాభిమానం ముందు బిజినెస్‌ను పక్కన పెట్టానని, డిస్నీ లాభనష్టాలు చెప్పినప్పటికీ తాను ధైర్యంగా సినిమా రిలీజ్‌ను వదిలేశానని తెలిపారు. భారతీయతపై తనకున్న గౌరవాన్ని ఈ చర్య ద్వారా చాటుకున్నట్లు అన్నారు.
చైనా వంటి దేశాల్లో తన సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ, దేశ ప్రయోజనాలను ఎక్కడా తగ్గించలేదని చెప్పారు. కార్గిల్ యుద్ధం అనంతరం లెహ్‌లో ఆర్మీ క్యాంపులలో వెళ్లి, సైనికులను ప్రోత్సహించిన విషయాన్ని పంచుకున్నారు. వారితో కలిసి బంకర్లలో ఉండటం, వారి అనుభవాలను తెలుసుకోవడం తన జీవితంలో గుర్తుండిపోయే ఘట్టమని పేర్కొన్నారు. సినీ రంగంలో ఉన్నా, దేశానికి మొదట ప్రాధాన్యతనిచ్చే వ్యక్తినని మరోసారి చాటిచెప్పారు.









