బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’ (Arracheera). మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కథాంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ఒక కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
‘ఎర్రచీర’ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A సర్టిఫికెట్ మంజూరు చేసింది. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈ సినిమా చూడటానికి అనుమతి లేదని, ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ ఈ సినిమా చూసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకుడు సుమన్ బాబు సూచించారు. హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉండబోతున్నాయని చిత్రబృందం వెల్లడించింది.
తాజాగా మూవీ మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డివోషనల్ టచ్ ఉన్న ‘ఎర్రచీర’ సినిమాను ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తూ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని తెలిపారు. కథలోని భావోద్వేగాలు, భక్తి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. ‘‘కొన్ని సినిమాల ఆత్మను నిజంగా అనుభూతి చెందాలంటే అవి థియేటర్లోనే చూడాలి. మా ‘ఎర్రచీర’ కూడా అలాంటి సినిమా. సౌండ్ డిజైన్, విజువలైజేషన్ అన్నీ థియేటర్ అనుభూతికి తగ్గట్టుగా రూపొందించాం. హారర్, ఎమోషన్‌ను పూర్తి స్థాయిలో ఫీల్ కావాలంటే తప్పకుండా థియేటర్లోనే చూడాలి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ‘ఎర్రచీర’పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.









