చంద్రహాస్ ప్రమోషన్ షాక్- జేడీ చక్రవర్తి ఫైర్

బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ’ విడుదలైనప్పటి నుంచే ట్రోలింగ్‌కు గురవుతూ వస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ఈ నెల 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో చంద్రహాస్ స్టేజీపై అత్యుత్సాహంతో బూతు పదాలు ఉన్న ఒక పాటను పాడటం తీవ్ర వివాదానికి దారి తీసింది. కుటుంబ సభ్యులు, మహిళలు హాజరైన వేదికపై హీరో ఇలా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనలో మరో కీలక అంశంగా మారింది జేడీ చక్రవర్తి పేరు. స్టేజీపై ఉన్న జేడీ ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనను టార్గెట్ చేశారు. బూతు పదాలు ఉన్న పాటను ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టారని జేడీపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌కు వచ్చిన జేడీ అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నారు.
ఈ విషయంపై తాజాగా స్పందించిన జేడీ చక్రవర్తి.. “చంద్రహాస్ పాట పాడుతున్నప్పుడు మొదట మాకు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత నేను, జయంత్ షాక్‌లో ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. సింగర్ కూడా ఉన్నాడా అని ఆశ్చర్యపోయాం” అని చెప్పారు. సాధారణంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో అన్ని మాటలు వినలేమని, అలా గమనిస్తున్నట్టే ఉంటామని తెలిపారు. పాట అర్థం కాకపోవడంతోనే తల ఊపినట్లు కనిపించిందని జేడీ క్లారిటీ ఇచ్చారు.
తన పక్కన ఉన్న యువతికి తెలుగు అర్థం కాక చప్పట్లు కొట్టిందని, అదే సమయంలో తాను కూడా అలానే స్పందించానని జేడీ తెలిపారు. అయితే కొందరు వీడియోలను కావాలనే ఎడిట్ చేసి తనపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “నా ముందు ఎవరైనా బూతులు మాట్లాడితే నేను అస్సలు సహించను. గతంలో ఇలాంటి విషయాల్లో ఒక డైరెక్టర్‌ను కూడా కొట్టాను. ఇలాంటి చెత్త ప్రమోషన్లు చేస్తే సినిమాలు ఆడతాయని అనుకుంటే అది వాళ్ల భ్రమ మాత్రమే” అంటూ జేడీ తీవ్రంగా మండిపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share