విజయనగరం గ్రామంలో ఓ లేటు వయస్సులో జన్మించిన అభి అనే యువకుడు జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని కోరుకుంటాడు. అతను కాలేజ్‌లో స్ఫూర్తిని ప్రేమించడంతో కథకు ప్రధాన మలుపులు మొదలవుతాయి. జాబ్ కోసం ప్రయత్నించే సమయంలో, అతను ఒక పెద్ద కంపెనీలో చేరుతాడు. అక్కడ జరిగే పరిణామాలు, అతను ఎదుర్కొన్న సంఘటనలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి.
విశ్లేషణ:
కిరీటి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమవడం ఆసక్తి రేకెత్తించింది. తెరపై హీరోగా ఆయన ఎనర్జీ, డాన్స్, ఫైట్లు ఆకట్టుకున్నా, కథాబలహీనత వల్ల సినిమాకి పరిపూర్ణత అందలేదు. మొదటి భాగం చక్కగా సాగినప్పటికీ, రెండో భాగంలో స్క్రీన్ ప్లే తడబడింది. ముఖ్యంగా విలన్ పాత్రను అణిచివేయడం, కథను విజయనగరానికి మళ్లించడం కొంత అసంతృప్తికరంగా మారాయి.
నటీనటుల ప్రదర్శన:
కిరీటి తన మొదటి సినిమాకే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డాన్సులు, యాక్షన్ సీన్స్ లో మంచి మార్కులు కొట్టేశాడు కానీ ఎమోషనల్ సీన్స్ లో ఇంకా మెరుగుదల అవసరం. శ్రీలీలకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్లస్ అయ్యింది. జెనీలియా పాత్ర మరీ పెద్దదిగా రాసుకోలేదుగానీ తన స్థాయికి తగినట్లే చేసింది.
సాంకేతిక అంశాలు:
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. ‘వైరల్’ పాట మాస్‌లో నిలిచిపోతుంది. సెంథిల్ ఫొటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, రేవంత్ కొరియోగ్రఫీ సినిమాకు అద్భుతంగా పని చేశాయి. కొన్ని డైలాగ్స్ ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అయితే ‘జూనియర్’ అనే టైటిల్ కథకు ఎంతమాత్రం ముడిపడలేదన్నది ఒక ప్రశ్నగా మిగిలింది.









