చెదల వల్ల నష్టం: లారెన్స్ మానవత్వం మెరిసింది

Raghava Lawrence extends financial support to a poor family whose savings were destroyed by termites.

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన సహృదయత్వాన్ని చాటుకున్నారు. తమిళనాడులోని తిరుప్పువనం గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం చెదల వల్ల కష్టపడి దాచుకున్న డబ్బును కోల్పోయిన ఘటనపై ఆయన స్పందించి మానవత్వానికి మరో నిదర్శనంగా నిలిచారు. లక్ష రూపాయల మేర నష్టం వచ్చిన ఆ కుటుంబానికి పూర్తిగా ఆర్థిక సహాయం చేశారు.

కుమార్ అనే కూలీ కార్మికుడు తన భార్య ముత్తుకరుప్పితో కలిసి పిల్లల చెవిపోగుల కోసం కొన్నేళ్లుగా ఆదా చేసిన డబ్బును ఓ హుండీలో భద్రపరిచారు. ఇంటి ఆవరణలో ఒక గోతిలో దానిని దాచిన ఈ దంపతులు, కొన్ని నెలల తర్వాత హుండీ తీసి చూసే సరికి అందులోని ఐదు వందల నోట్లు చెదల కారణంగా పూర్తిగా పాడయ్యాయని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బు ఇలా పాడైపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు.

ఈ సంఘటన గురించి సమాచారం స్థానిక మీడియా, సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన లారెన్స్, తన ఎక్స్ ఖాతాలో భావోద్వేగంతో స్పందించారు. “చెదలు తినేసిన పొదుపు గురించి చదివిన వెంటనే చాలా బాధేసింది. ఈ కుటుంబానికి నేను నా వంతుగా సహాయం చేయాలనిపించింది. నష్టం వచ్చిన మొత్తాన్ని వారికి అందజేశాను. మీడియాకు, ప్రజలకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

లారెన్స్ చేసిన ఈ సహాయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రశంసలు పొందుతోంది. ఎంతో మంది ఆయన మానవతా గుణాన్ని కొనియాడుతున్నారు. కేవలం పాఠాలపై కాకుండా, ప్రజల కష్టాల్లో సానుభూతితో స్పందించే మనిషిగా లారెన్స్ మరోసారి నిరూపించుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share