వారణాసితో గ్లోబల్ స్టేజ్‌పై మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఇది మహేష్ కెరీర్‌లో 29వ సినిమాగా రూపొందుతోంది. ఇప్పటివరకు ప్రాంతీయ చిత్రాలతోనే రికార్డులు సృష్టించిన మహేష్, ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ఇందులో మహేష్ బాబు రుద్ర పాత్రలో, రాముడి అవతారంలో కనిపించనుండగా.. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కలిసి పలు హాలీవుడ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్లో ‘వారణాసి’ సినిమా కాన్సెప్ట్‌, విజన్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల గురించి మాట్లాడారు. “నిజం చెప్పాలంటే ప్రతి సినిమా నన్ను ఏదో ఒక విధంగా మార్చింది. కానీ నన్ను పూర్తిగా మార్చేసిన సినిమా ‘పోకిరి’. అది నన్ను ఒక స్టార్‌గా నిలబెట్టింది. అందుకే ఆ సినిమా నా కెరీర్‌ను మార్చిన మూవీ అని చెప్పాలి” అని మహేష్ అన్నారు. 2006లో విడుదలైన పోకిరి తన జీవితంలో ఊహించని మార్పులు తీసుకొచ్చిందని గుర్తు చేసుకున్నారు.
“పోకిరి విజయం తర్వాత నేను కొంత గందరగోళానికి గురయ్యాను. ఒక్కసారిగా వచ్చిన క్రేజ్‌, అంచనాలు నన్ను మరింత బాధ్యతగా మారేలా చేశాయి” అని మహేష్ వెల్లడించారు. ఇప్పుడు ‘వారణాసి’తో తన కెరీర్‌లో మరో కీలక దశ మొదలవుతోందని, ఈ సినిమా తనను కొత్త స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. మొత్తానికి మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమాను గ్లోబల్ మ్యాప్‌పై మరోసారి నిలబెట్టబోతోందన్న అంచనాలు బలంగా ఉన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share