పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG) విడుదల తేదీపై నెలకొన్న అనుమానాలకు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ స్పష్టత ఇచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న రాబోతుందా లేదా అనే ఊహాగానాలు జోరుగా వెబ్ మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటనతో అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో “మనం ముందే ప్రకటించినట్టే ‘ఓజీ’ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వస్తుంది. కాబట్టి ఫేక్ న్యూస్, రూమర్లను ఎవరు నమ్మకండి. పవన్ కల్యాణ్ అభిమానులు ధైర్యంగా ఉండండి” అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్కంఠకు తెరపడింది.
‘ఓజీ’ సినిమా యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ఈ మూవీ కోసం పవన్ చేసిన లుక్, స్టైల్, యాక్షన్ ఎపిసోడ్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. ఫ్యాన్స్ భారీగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 25న ‘ఓజీ’ విడుదల ఖాయమని నిర్మాతలు మరోసారి ప్రకటించడంతో పవన్ అభిమానులలో ఆనందం వెల్లివిరిసింది. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.









