టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. లివింగ్ రిలేషన్షిప్ నేపథ్యంతో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సంతోష్ శోభన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సమాజంలో మారుతున్న విలువలపై స్పందించిన సంతోష్ శోభన్, మనం ప్రస్తుతం మంచి విషయాలను పక్కన పెట్టి చెడ్డవాటినే త్వరగా అలవాటు చేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. సినిమాల ద్వారా వచ్చే సందేశాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, కేవలం ఉపరితల అంశాలపైనే ప్రేక్షకులు దృష్టి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపే అంశమని అన్నారు.
హాలీవుడ్ చిత్రం Barbie ఉదాహరణగా తీసుకున్న సంతోష్, ఆ సినిమా భారీ విజయం సాధించడానికి కారణం బొమ్మల కథ కాదు, అందులోని బలమైన సందేశమేనని చెప్పారు. అలాగే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన Animal సినిమా వర్కవుట్ కావడం కేవలం బోల్డ్ సన్నివేశాల వల్ల మాత్రమే కాదని, దాని వెనుక ఉన్న ఎమోషన్, ప్రెజెంటేషన్ కారణమని వివరించారు. కానీ ప్రేక్షకులు మాత్రం తప్పుడు అంశాలను మాత్రమే త్వరగా వంటబట్టించుకుంటున్నారని అన్నారు.
అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం నేటి యువత ఆలోచనలకు అద్దం పడుతుందని చిత్ర బృందం చెబుతోంది. లివింగ్ రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సంతోష్ శోభన్ చేసిన ఈ బోల్డ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, వాలెంటైన్స్ డే రేసులో ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.









