‘ఫంకీ’తో మళ్లీ కొత్తగా మొదలుపెడుతున్నా- విశ్వక్ సేన్

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలో ‘ఫంకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు కె.వి. అనుదీప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మరింత వేగంగా నిర్వహిస్తోంది. వరుస అప్డేట్స్‌తో సినిమాపై హైప్ పెంచుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార సామగ్రికి మంచి స్పందన లభిస్తోంది.

ఇటీవలే ‘ఫంకీ’ నుంచి విడుదలైన రెండవ గీతం ‘రట్టాటటావ్’ సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ పాట విడుదల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తన కెరీర్, ప్రేక్షకులతో ఉన్న అనుబంధం గురించి ఆయన ఓపెన్‌గా మాట్లాడడం అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ, తన మొదటి సినిమా నుంచే ప్రేక్షకులు తనకు అండగా నిలిచారని తెలిపారు. గత చిత్రాల్లో కొన్ని ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయిన విషయాన్ని అంగీకరిస్తూ, అందరి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నానని చెప్పారు. ‘ఫంకీ’ సినిమాతో మళ్లీ ఒకటి నుంచి మొదలుపెడుతున్నాను. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫిబ్రవరి 13న థియేటర్లలో చూసి ఆదరించండి అని ఆయన ప్రేక్షకులను కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share