అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంలో ఘనంగా ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా 191 అడుగుల ఎత్తైన శిఖరంపై ప్రత్యేకంగా రూపొందించిన కాషాయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రధానమంత్రి మోడీ, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ స్వాములను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ ధ్వజారోహణం 2024 జనవరిలో జరిగిన ‘ప్రాణ ప్రతిష్ఠ’ తర్వాత రెండో అత్యంత చారిత్రక మైలురాయిగా పరిగణించబడుతోంది. ప్రత్యేకంగా రూపొందించిన జెండా దేశీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యతకు కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది. ఈ కార్యక్రమం పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో నిర్వహించబడింది.
ధ్వజారోహణం రోజులలో రాముడు, సీతాదేవి వివాహం జరిగే ‘వివాహ పంచమి’ పవిత్ర దినం కూడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్వామి గర్భగుడిలోని రామదర్బార్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ ఉత్సవానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరియు దేశంలోని వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు. ఈ ధ్వజారోహణం రామరాజ్యపు ఆదర్శాలను దేశంలో ప్రతిబింబిస్తూ, కొత్త యుగానికి సంకేతంగా నిలుస్తుంది.









