అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటన ఎయిరిండియా సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. లండన్‌కు 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో ఒక్కరు తప్ప మిగిలిన ప్రయాణికులు అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో భద్రతపై భయాలు పెరిగిపోవడంతో సంస్థపై నమ్మకం దెబ్బతింది. ఫలితంగా బుకింగ్‌లు భారీగా తగ్గాయి.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీఓ) అధ్యక్షుడు రవి గోసైన్ ప్రకారం, అంతర్జాతీయ మార్గాల్లో 18–22 శాతం, దేశీయ మార్గాల్లో 10–12 శాతం బుకింగ్‌లు పడిపోయాయి. మొత్తంగా దాదాపు 20 శాతం వరకు డ్రాప్ కనిపించిందని ఆయన తెలిపారు. ఈ ప్రభావం తాత్కాలికమైనదే అయినా, ట్రావెల్ రంగాన్ని తడిమిపారేస్తోందని పేర్కొన్నారు.
బుకింగ్‌ల తగ్గుదలతోపాటు టికెట్ ధరలు కూడా తగ్గినట్టు గోసైన్ వివరించారు. దేశీయ మార్గాల్లో ధరలు 8–12 శాతం, అంతర్జాతీయంగా ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో 10–15 శాతం తగ్గాయి. డిమాండ్ తగ్గడమే కాక, ప్రయాణికులను ఆకర్షించేందుకు సంస్థ తీసుకుంటున్న వ్యూహాలు కూడా ధరల తగ్గుదలకు కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ (ఫెయిత్) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా కూడా ఈ అభిప్రాయాన్ని బలపరిచారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటుండటం, కార్పొరేట్ క్లయింట్లు ఇతర సంస్థల వైపు మొగ్గు చూపడం వంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే ఈ ప్రభావం కొంతకాలం మాత్రమే ఉంటుందని, భవిష్యత్‌లో పరిస్థితి తిరిగి స్థిరపడతుందని అభిప్రాయపడ్డారు.









