అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడంతో ఆ ప్రాంతం తిరుగులేని అభివృద్ధి బాట పట్టింది. ముఖ్యంగా భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. దీనివల్ల భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రామాలయం చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు 30 నుంచి 200 శాతం వరకూ పెరిగాయి. ఇది గత ఎనిమిదేళ్లలో మొదటిసారి భూముల ధరల్లో ఇంత పెరుగుదల నమోదవ్వడం కావడం విశేషం.
సదర్ (ఫైజాబాద్) సబ్ రిజిస్ట్రార్ శాంతి భూషణ్ చౌబే వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 2004లో చేసిన ధరల సవరణ ప్రతిపాదన ఆధారంగా కొత్త సర్కిల్ రేట్లను జిల్లా మెజిస్ట్రేట్ ఆమోదించారు. ఈ రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ధరల పెంపు నిర్ణయం పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ఆకర్షించనుంది. ముఖ్యంగా ఆలయం పరిసర ప్రాంతాలు మౌలిక వసతుల కల్పనతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
కొత్త రేట్ల ప్రకారం రాకాబ్ గంజ్, దేవ్ కాళి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు చదరపు మీటరుకు రూ.26,600 నుంచి రూ.27,900 కు పెరిగాయి. ఇదివరకు ఈ రేటు రూ.6,650 నుంచి రూ.6,975 మధ్యలో ఉండేది. అయోధ్య ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవడం, రామాలయం నిర్మాణం పూర్తవడం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈ పెరుగుదల రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ భూములపై వేరువేరుగా ప్రభావం చూపుతుందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ధరల పెరుగుదలతో స్టాంప్ డ్యూటీ భారం పెరగొచ్చని అన్నారు. అయితే భూముల అధికారిక విలువ పెరగడంతో భూ యజమానులకు ఆర్థిక లాభం జరుగుతుందని విశ్లేషించారు. ఇది భవిష్యత్తులో అయోధ్యను కీలక పెట్టుబడుల కేంద్రంగా మార్చనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.









