ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించి జరుగుతున్న మనీలాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో ఉన్న బఘేల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, అనంతరం చైతన్యను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు ఛత్తీస్‌గఢ్‌లో భారీ స్థాయిలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించినది. ఈ స్కామ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తులో భాగంగా చైతన్య బఘేల్ ఈ మద్యం సిండికేట్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్టు, ఈ వ్యవహారంలో ఆయన పాత్ర స్పష్టంగా కనిపించినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. వారి నివేదిక ప్రకారం మద్యం సిండికేట్‌కు దాదాపు రూ. 2,000 కోట్ల లాభం చేకూరినట్టు ఉంది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గతంలోనూ బఘేల్ నివాసంలో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. తాజా దర్యాప్తులో కొత్త ఆధారాలు లభించడంతో శుక్రవారం ఉదయం మరోసారి భిలాయ్‌లోని బఘేల్ నివాసంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దర్యాప్తు కొనసాగుతుండగా, చైతన్య అధికారులకు సరైన సహకారం ఇవ్వకపోవడంతో ఆయనను అరెస్టు చేశారు.
ఈ పరిణామం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ వర్గాలు ఈ చర్యను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తున్నా, అధికార బీజేపీ మాత్రం ఇది చట్టప్రకారం జరిగిందని స్పష్టం చేస్తోంది. ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంచుకోనుండగా, భవిష్యత్‌లో మరిన్ని అరెస్టులు, వెల్లడి జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.









