ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన మైనర్ కొడుక్కి కాబోయే భార్యను ప్రేమించి, చివరికి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. షకీల్ అనే వ్యక్తి, మొదట తన కొడుక్కి ఓ యువతిని పెళ్లికి చూసి నిశ్చయం చేశాడు. అయితే ఆ యువతితో తరచూ ఇంటికి వెళ్లుతూ మాట్లాడుతూ ఉండడంతో, ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆ తరువాత, షకీల్ తన కొడుక్కి కాబోయే వదినను పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్లిపోయాడు.
ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులపై షకీల్ దాడి చేసినట్లు అతని భార్య షబానా ఆరోపించింది. ఆమె వివరించగా, షకీల్‌తో తమకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. “అతను మా కొడుక్కి నిశ్చయించిన అమ్మాయితోనే ప్రేమలో పడిపోయాడు. మొదట్లో ఎవరూ నన్ను నమ్మలేదు, కానీ ఆ ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా. రోజంతా ఆమెతో వీడియో కాల్స్ చేస్తూ ఉండేవాడు” అని షబానా తెలిపారు.
ఈ వ్యవహారాన్ని గమనించిన తర్వాత షబానా తన కొడుకుతో కలిసి ఆధారాలు సేకరించింది. షబానా తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న తర్వాత ఆమె కొడుకు ఆ యువతిని పెళ్లి చేసుకోమని నిరాకరించాడు. షబానా కుమారుడు మాట్లాడుతూ, తండ్రి పెళ్లికి తన తాతయ్య, నాయనమ్మ మద్దతిచ్చారని, ఇంట్లోంచి రూ. 2 లక్షలు, సుమారు 17 గ్రాముల బంగారం తీసుకెళ్లారని ఆరోపించాడు.
ఇదే తరహాలో ఏప్రిల్‌లో అలీఘర్‌లో మరొక ఘటన చోటు చేసుకుంది. శివాని అనే యువతి వివాహం జరగబోయే రాహుల్ అనే వ్యక్తితో ఆమె తల్లి అనిత పారిపోయింది. అనిత, ఇంట్లో ఉన్న రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల బంగారం తీసుకెళ్లింది. గతంలోనుంచి రాహుల్‌తో ఫోన్‌లో తరచూ మాట్లాడుతుండేవారని, ఈ విషయం తమకు మొదట్లో తెలియలేదని శివాని తండ్రి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు సమాజంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.









