ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2 నుంచి ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశమని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. అదే సమయంలో, బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం కూడా ప్రధాన కార్యక్రమంగా ఉంది.
జూలై 2న మోదీ తన పర్యటనను ఘనాతో ప్రారంభిస్తారు. మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. జూలై 2, 3లో ఘనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి, ఆర్థికం, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారం పెంచుకోవాలని ఉద్దేశ్యంతో ముందుకెళ్తారు. జూలై 3, 4 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించి అక్కడి ప్రధాన నేతలతో చర్చలు జరుపుతారు. 1999 తర్వాత ఈ కరేబియన్ దేశంలో భారత్ అధిపతి పర్యటించడం ఇదే మొదటిసారి.
ట్రినిడాడ్ నుంచి మోదీ అర్జెంటీనాకు వెళ్ళి జూలై 4, 5లో అక్కడ ఉంటారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గాఢం చేయాలని భారత్ భావిస్తోంది.
అర్జెంటీనా పర్యటన తర్వాత మోదీ జూలై 5-8 మధ్య బ్రెజిల్లో ఉంటారు. రియో డి జనీరో వేదికగా జరిగే 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొని, శాంతి భద్రతలు, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు, ప్రపంచ ఆరోగ్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. జూలై 9న చివరిగా నమీబియాకు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి, నమీబియా పార్లమెంటులో ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.









